
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గౌతంరెడ్డి
నల్లబెల్లి: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు కృషి చేయాలని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతంరెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మామిండ్లవీరయ్యపల్లిలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. హాజరైన గౌతంరెడ్డి రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, పంప్‌సెట్ల వినియోగం, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ వంటి అంశాలపై చర్చించి సూచనలిచ్చారు. అధికారులు చేపట్టాల్సిన చర్యలను వివరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమయానుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ ఆనంద్, డీఈఈ తిరుపతి, ఏడీఈ లక్ష్మణ్, ఏఈ హరిబాబు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.