
మహిళా క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఎంజీఎం: మహిళా ఆరోగ్య క్లినిక్‌ల ద్వారా అందించే సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. గోపాల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతీ మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా క్లినిక్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా అక్కడకు వచ్చిన మహిళలను వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆస్పత్రిలోని ఫార్మసీ, ల్యాబ్, వ్యాక్సిన్ భద్రపరిచే విభాగాలు, రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీ పరిధిలో జ్వరసర్వే, పాఠశాలల్లో, గ్రామాల్లో నిర్వహించే మెడికల్ క్యాంపుల వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హసన్‌పర్తి: హసన్‌పర్తి సంస్కృతీ విహార్‌లోని గ్రామీణ ఉపాఽధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ బాస రవి తెలిపారు. సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్‌లో (13 రోజులు), ఎలక్ట్రిషీయన్, హౌజ్ వైరింగ్‌లో (30 రోజులు), మొబైల్ రిపేరింగ్‌లో (30రోజుల) పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సు, తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఈనెల 26 లోపు సంస్కృతీ విహార్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 26 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు ఫోన్ నంబర్ 98493 07873 సంప్రదించాలని మేనేజర్ రవి సూచించారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన గుణశేఖర్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్క అందజేశారు. కమిషనరేట్ పరిధిలో చోరీలను నియంత్రించడంతో పాటు పెండింగ్ కేసుల్లో పట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీపీ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు.
విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రత్యేక ఉపాధ్యాయుల చేత గుర్తించిన ప్రత్యేక అవసరాల పిల్ల లకు వైకల్యం స్థాయి నిర్ధారణ పరీక్షలు ఈనెల 23న హనుమకొండలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో నిర్వహించనున్నట్లు డీఈవో డి. వాసంతి మంగళవారం తెలిపారు. అర్హత కలిగిన ప్రత్యేక అవసరాల పిల్లలు వారి రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 40శాతం వైకల్యం ఉన్నట్లుగా నిర్ధారించిన ధ్రువపత్రం, ప్రభుత్వ వైద్యుడు అందించిన సదరం ధ్రువపత్రం మీద హెచ్‌ఎం, మండల విద్యాధికారి సంతకం చేసిన కాపీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, యూనివర్సల్ డిజేబిలిటీ ఐడీ వంటి ధ్రువపత్రాలు తీసుకొనిరావాలన్నారు. ఈవైకల్య స్థాయి నిర్ధారణ క్యాంపులో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఎంపిక చేసిన వైద్యబృందం ఈ క్యాంపులో పాల్గొంటుందని తెలిపారు. వారిలోని లోపాలను గుర్తించి అవసరమైన ప్రత్యేక పరికరాలను అందజేసేందుకు ఈక్యాంపును నిర్వహిస్తున్నారన్నారు. అదనపు సమాచారం కోసం జిల్లా సమ్మిళిత విద్య సమన్వయ కర్త బద్దం సుదర్శన్‌రెడ్డిని 9603672289 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

మహిళా క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి