
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 92 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా భూసమస్యలు 33, జీడబ్ల్యూఎంసీ 18, గృహానిర్మాణం 9, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖకు సంబంధించి 4, ఇతర శాఖలకు సంబంధించినవి 24 ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
వాల్టా చట్టం ప్రకారం చర్యలు
తీసుకోవాలి..
నా వ్యవసాయ బావి పక్కనే ఓ వ్యక్తి బావిని తవ్వాడు. వాల్టా చట్టం ప్రకారం బావికి, బావికి మధ్య దూరం 50 మీటర్లు ఉండాలి. చట్టాన్ని అతిక్రమించి బావిని తవ్వడంతో నా బావి ఎండిపోయింది. అతడిపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలి.
– పి.అశోక్‌రెడ్డి, కొమ్మాల, గీసుకొండ
ఇళ్లు కోల్పోయిన వారికి
స్థలాలు ఇవ్వాలి
వర్థన్నపేట మండల కేంద్రంలో 2021లో జాతీయ రహదారి కోసం రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్లు కోల్పోయాం. పది మందికి పట్టాలు ఇచ్చారు. ఇంకా 17 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. భూమి ఉన్నా అధికారులు పట్టాలు ఇచ్చేందుకు నిర్లక్ష్యం వహిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. మేము షెడ్యూల్ కులాలకు చెందిన వారం. మాకు ఉండటానికి ఇళ్లు లేవు. మాకు న్యాయం చేయాలి.
– వర్థన్నపేట వాసులు
రిజిస్ట్రేషన్ చేసుకోవాలని
చూస్తున్నాడు..
నాకు రికార్డుల్లో 21 గుంటల భూమి ఉంది. తెలియకుండా మా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడికి ఎలాంటి హక్కులేదు. నాకు న్యాయం చేయాలి.
– పి.బస్వయ్య, జీజీఆర్ పల్లి,
శివారు మైబుపల్లి, నర్సంపేట
ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద