
ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి
● రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్ : చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రుద్రేశ్వరస్వామి వారిని విభూది, గంధంతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతికి అభిషేకం, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు.
భద్రకాళి దేవాలయంలో..
భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి శ్రావణమాస పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. మేయర్ గుండు సుధారాణి ఒడిబియ్యం, చీర సమర్పించారు. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ జితేంద్రగుప్తా, సీపీఎంజీ తెలంగాణ పీవీఎస్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు వరంగల్ ఎస్పీ రవికుమార్, హనుమకొండ ఎస్పీ హనుమంతు, సీతారాం, వెంకన్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా వరంగల్‌లోని సద్గురు శివానందమూర్తి గురుసప్తధామంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో శుక్రవారం రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని, శ్రీచక్రాన్ని పూలమాలతో అలంకరించారు. అమ్మవారి ఉపాసకులు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. హంటర్‌రోడ్డులోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘నవోదయ’ గడువు పెంపు
మామునూరు : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న చివరి తేదీ ఉండగా.. విద్యాలయ సమితి మరోమారు గడువు పెంచుతూ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
కమిషనరేట్‌లో పంద్రాగస్టు వేడుకలు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీపీ సన్‌ప్రీత్‌సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్‌రావు, సురేశ్‌కుమార్, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, పరిపాలన విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం.. వేతనాల్లో కోత
రామన్నపేట : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అనుమతి లేకుండా గైర్హాజరైన ఆరుగురు జవాన్ల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు బల్దియా సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు. 9,10 డివిజన్లలో క్షేత్రస్థాయిలో హాజరును తనిఖీ చేసే క్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది కనీసం 50 శాతం హాజరు నమోదు కాలేదని, 3–4 రోజులు వారి పనితీరును గమనించి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆరుగురు జవాన్ల వేతనంలో ఒక రోజు కోత విధించినట్లు పేర్కొన్నారు. ఇలాగే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే కఠిన చర్యలతో పాటు విధుల నుంచి తొలగిస్తామని సీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.

ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి