
గూడు కరువు.. టెంటే ఆదెరువు
● నిలువ నీడలేక టెంట్‌కిందే మృతదేహం
దుగ్గొండి: నాలుగు గుంజలు. వాటి చుట్టూ పరదా. గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయే పరిస్థితి. వానపడినంత సేపూ బిక్కుబిక్కుమంటూ కాళ్లు ముడుచుకుని కూచోవాల్సిందే. అలాంటి నిరుపేద అనారోగ్యంతో మృతి చెందాడు. చివరికి అతడికి టెంట్ నీడే గతి అయ్యింది. దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రామగిరి రవి(50) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. కూలీ పని చేసుకుని పొట్టపోసుకునే రవికి ఎలాంటి ఆస్తులు లేవు. నాలుగు గుంజలు పాతి పరదా కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అతడు మృతి చెందడంతో ఆరుబయట టెంట్ వేసి మృతదేహాన్ని ఉంచారు. ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. భార్య కళావతి, కుమారుడి రోదనలు మిన్నంటాయి. రామగిరి రవి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఇప్పటి వరకు అతడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదు.

గూడు కరువు.. టెంటే ఆదెరువు