
అవినీతి అక్రమాలను సహించేది లేదు
నర్సంపేట: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అవినీతి అక్రమాలు జరిగినట్లు తేలితే సహించేది లేదని డీఆర్‌డీఓ కౌసల్యాదేవి అన్నారు. చెన్నారావుపేట మండలంలోని 30 గ్రామాల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి 2025 వరకు కొనసాగిన ఈజీఎస్ పనులపై సామాజిక తనిఖీ బృందం సభ్యులు 1 ఆగస్టు నుంచి 11వ తేదీ వరకు గ్రామాల్లో సోషల్ ఆడిట్‌ను నిర్వహించి గ్రామసభలను ఏర్పాటు చేశారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్పీ, డీఆర్పీలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులపై నిర్వహించిన సోషల్ ఆడిట్ నివేదికలను చదివి వినిపించారు. సామాజిక తనిఖీలో ఒకరికి బదులు మరొకరు పనులకు వెళ్లడం, అమృతండాలో ఒకే కుటుంబంలో ఇద్దరికి జాబ్‌కార్డు మంజూరు చేశారని తెలిపారు. అలాగే రోజ్ గార్ నివాస్ సమావేశాలను ఏర్పాటు చేయడం లేదని, రోడ్లకు ఇరు వైపుల మొక్కలు ఎండిపోయాయని తెలిపారు. అంతే కాకుండా కూలీల కు వేతన రశీదులు ఇవ్వడం లేదని, పనుల రిజిష్టర్లు సక్రమంగా మెయింటెన్స్ చేయడం లేదని ప్రజా వేదికలో తెలిపారు. దీంతో ఆమె ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరును మార్చుకోవాలని మండిపడ్డారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఏడీపీ కృష్ణవేణి, విజిలెన్స్ అధికారి అలివేలు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి మాధవి, ఎంపీడీఓ నల్ల శ్రీవాణి, ఎస్‌ఆర్పి గంగరాజు, ఏపీఓ అరుణ, ఈసీ కిశోర్‌కుమార్ క్లస్టర్ టీఏలు సుధాకర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది తమ పని తీరును మార్చుకోవాలి
ఆగ్రహం వ్యక్తం చేసిన డీఆర్‌డీఓ
కౌసల్యాదేవి