
వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపునీరు
అర్ధరాత్రి అత్యంత భారీ వాన
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఇళ్లలోకి చేరిన వరద
మత్తళ్లు పోస్తున్న చెరువులు
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
నీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్ పట్టాలు
బల్దియా, పోలీసుల సహాయక చర్యలు
సాక్షి, వరంగల్: సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు దంచి కొట్టిన వానతో ఎటు చూసినా నీరే.. ప్రధాన రహదారులు, లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపించాయి. కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు జాగారం చేశారు. సామగ్రి పూర్తిగా నీటిలో మునగడంతో పిల్లాపాపలతో ఇబ్బందులు పడ్డారు.
వరంగల్ రైల్వే స్టేషన్‌లోని పట్టాలపైకి వాన నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది నీటిని బయటకు పంపించడంతో రాకపోకలు కొనసాగాయి. ముఖ్యంగా సాయిగణేష్ కాలనీ, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్యనగర్, ఎస్ ఆర్ నగర్, గిరిప్రసాద్ కాలనీ, వివేకానంద కాలనీ, మధురానగర్, పద్మానగర్, డీకే నగర్, శివనగర్, సాకరాశికుంట, నాగేంద్రనగర్, జన్మభూమి జంక్షన్ , వాంబే కాలనీ, తెలంగాణ కాలనీలు నీట మునగడంతో జనాలు ఇబ్బందిపడ్డారు. నగరంలో ద్విచక్ర వాహనాలు, కార్లు నీట మునిగాయి. హంటర్ బ్రిడ్జ్ రోడ్డులోకి భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అలాగే అగర్తాల (మెట్టు చెరువు)లో నుంచి నీరు ఒక్కసారిగా రావడంతో ఖమ్మం హైవేలోనీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ముందునుంచి మోకాలి లోతున నీరు వెళ్లడంతో రాకపోకలకు ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు అంతరాయం కలిగింది. కాశీకుంట వాంబేకాలనీలోని ఇంట్లోకి నీరు రావడంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది.
వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ కాలేజ్ ప్రాంగణంలో నీరు నిలిచింది. వరద నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బల్దియా తరఫున రెండు డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగిన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాయి. వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రోమ్ వాటర్ డ్రైన్‌లు ఇరుకుగా ఉండడంతో నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే వరద నీరు నిలిచింది.
పునరావాస కేంద్రాలకు తరలింపు
ఎస్‌ఆర్ నగర్‌లో శుభం గార్డెన్, గాంధీ నగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాల్‌లో, డీకే నగర్‌లో బీరన్నకుంట హైస్కూల్, గిరిప్రసాద్ నగర్‌లోని కమ్యూనిటీ హాల్, ఎంఎన్ నగర్‌లోని మార్వాడి హాల్‌లోని పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలించారు. వారికి సరిపడా ఆహారంతోపాటు మెడిసిన్స్ అందుబాటులో ఉంచారు. వైద్యులు వారికి అందుబాటులో ఉన్నారు. అయితే మంగళవారం ఉదయం నుంచి వర్షం కురవకపోవడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు.
ఉక్కిరి బిక్కిరి...
అతి భారీ వర్షంతో జిల్లా ఉక్కిరిబిక్కిరైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా 1,264.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగెం మండలంలో అత్యధికంగా 202.7 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఖిలావరంగల్‌లో 148.5 మిల్లీమీటర్లు, వర్ధన్నపేటలో 122.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మిగిలిన అన్ని మండలాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పర్వతగిరి మండలంలోని కొంకపాక శ్రీనగర్ క్రాస్ రోడ్ల మధ్య ఉన్న ప్రధాన రహదారిపై వర్షపునీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. అలాగే ఇదే మండలానికి చెందిన నారాయణపురంలో గేదెలను బయటకు తోలేందుకు ఆకేరు వాగులో దిగిన పశువుల కాపరి కందికగ్ల ఉప్పలయ్య వరదనీటిలో గల్లంతయ్యాడు.
ఖానాపురం మండలంలో నాజీతండాకు వెళ్లే దారిలో లోలెవల్ కల్వర్టు పైనుంచి వరద వెళ్లడంతో వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది. నెక్కొండ మండలం తూర్పు తండా –బంజరుపల్లి గ్రామాల మధ్య లోలెవల్ కాజ్‌వే పై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నెక్కొండకు చంద్రుగొండ మీదుగా బంజరుపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగెం మండలం ఎల్గూర్‌రంగంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్‌లో సుమారు 10 ఫీట్ల మేర వరదనీరు నిలువగా.. ఎల్గూర్ చెరువు మత్తడి పోస్తుంది.
వర్షపాతం ఇలా..(మిల్లీ మీటర్లలో)
సంగెం 202.7
ఖిలా వరంగల్ 148.5
వర్ధన్నపేట 122.3
పర్వతగిరి 107.5
వరంగల్ 94.9
గీసుగొండ 91.3
నెక్కొండ 88.2
చెన్నారావుపేట 86
రాయపర్తి 82.8
ఖానాపురం 70.3
దుగ్గొండి 63
నల్లబెల్లి 55.2
నర్సంపేట 51.5

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ సత్యశారద, పక్కన గ్రేటర్ కమిషనర్