
బీమా.. వర్తించేనా?
నల్లబెల్లి: రైతుల అకాల మరణంతో చితికిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తోంది. సహజ, ప్రమాదవశాత్తు మరణించిన రైతు నామినీకి బ్యాంక్ ఖాతాలో రూ.5 లక్షలు జమచేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో చేరేందుకు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరని పేర్కొంది. జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చిన రైతులతోపాటు ఇంత వరకు రైతు బీమా చేసుకోని రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 1,65,184 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇందులో గతంలో 1,10,948 మంది రైతులు రైతు బీమా పథకంలో చేరారు. ఇందులో నుంచి 59 ఏళ్ల వయసున్న వారిని తొలగిస్తూ.. 18 ఏళ్లు నిండిన రైతులను చేర్చనున్నారు.
నేటితో గడువు పూర్తి
జిల్లాలో జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చిన రైతులతోపాటు ఇంత వరకు రైతు బీమా చేసుకోని 10,388 మంది రైతులను ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. వీరు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శని, ఆదివారం సెలవు కావడంతో బీమా కోసం రైతులు దరఖాస్తు చేసుకోలేదు. సోమ, మంగళవారం రెండు రోజుల్లో సుమారుగా రెండు వేల మంది మాత్రమే రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడు (బుధవారం) మాత్రమే మిగిలి ఉంది. రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తు పారంతో రైతు పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి అందించాలి. ఈ వివరాలతో దరఖాస్తు చేసుకున్న రైతులు వివరాలను ఈ నెల 13 వరకు అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఒకే రోజులో పూర్తి స్థాయిలో రైతులు దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. దరఖాస్తు చేసుకున్న రైతు వివరాలను ఏఈఓలు ఎలాంటి తప్పులు లేకుండా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. దరఖాస్తులో ఏ చిన్న తప్పు జరిగినా బాధిత రైతు కుటుంబానికి పరిహారం అందేపరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా అప్‌లోడ్ చేయడం కుదరదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అర్హులైన రైతులందరు గడువు లోపు దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడవు పెంచితేనే రైతులకు మేలు జరుగనుంది.
గడువు పెంచాలి
బతుకుదెరువుకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన రైతులు వచ్చి దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. రైతు బీమా దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులే అవకాశం కల్పించడం సరికాదు. కనీసం 10 రోజులైన అవకాశం ఇవ్వాలి.
–పత్తి కర్ణాకర్, రైతు నల్లబెల్లి
అవకాశాన్ని వినియోగించుకోవాలి
అర్హులైన రైతులు స్థానిక క్లస్టర్ ఏఈఓలను కలిసి రైతు బీమా కోసం దరఖాస్తు ఫారంతో రైతు పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కా ర్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ అందించాలి. దరఖాస్తు గడువు పెంచే అవకాశంలేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– దామోదర్ రెడ్డి, వ్యవసాయ శాఖ
సహాయ సంచాలకుడు, నర్సంపేట
అయోమయంలో అన్నదాతలు
నేటితో ముగుస్తున్న గడువు
మరింత సమయం ఇవ్వాలంటున్న రైతులు

బీమా.. వర్తించేనా?

బీమా.. వర్తించేనా?