
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
న్యూశాయంపేట: రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమాషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి సంబంధిత అధికారులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ నుంచి ఆమె జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తహసీల్దార్లతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు. తమ మండలాల పరిధిలో జలమయమయ్యే ప్రాంతాలను గుర్తించి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని చెప్పారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని తెలిపారు.
టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు
వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1800 4253424, వరంగల్ కలెక్టరేట్ నంబర్ 91542 25936 లేదా.. వరంగల్ పట్టణానికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ 1800 4251980 టోల్‌ఫ్రీ నంబర్, 97019 99676, విద్యుత్ శాఖ నంబర్ 1800 4250028 ద్వారా సంప్రదించాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన