
అలా కడితే అప్పుల పాలవుతారు
హసన్‌పర్తి/రామన్నపేట/కాజీపేట అర్బన్: నిబంధనల మేరకు రూ.5లక్షల వరకు వ్యయంతోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలని, అలా కాకుండా స్లాబ్‌ను పెంచితే అప్పుల పాలవుతారని గృహ నిర్మాణశాఖ ఎండీ వీసీ గౌతమ్ సూచించారు. హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామంలో, గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధి కాజీపేట మండలం న్యూశాయంపేటలో, 33వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈసందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎంత ఖర్చు అయ్యింది? ఇంకా ఎంత అవుతుందని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. 600 ఎస్‌ఎఫ్‌టీ మేరకు స్లాబ్‌లో గోడల నిర్మాణం చేపట్టి, మరో 300 నుంచి 400ఎస్‌ఎఫ్‌టీ వరకు స్లాబ్ బయట పెంచినట్లు గౌతమ్ గుర్తించారు. ఇలాచేస్తే ఆర్థిక భారమై అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మేరకు స్లాబ్‌తో సహా 600 ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణం చేపట్టితే ఎలాంటి భారం పడే అవకాశం ఉండదన్నారు. నాణ్యమైన ఇసుక, ఇటుక, సిమెంట్, ఇనుముతో ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. మడిపల్లిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు సత్వరం పూర్తి చేస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీసుకొచ్చి ప్రారంభిస్తానని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ్ నాయక్, తహసీల్దార్లు ప్రసాద్, బావుసింగ్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, కార్పొరేటర్ మామిండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేట్టాలి
గృహ నిర్మాణశాఖ ఎండీ గౌతమ్