
వేగం పెంచాల్సిందే!
సాక్షి, వరంగల్:
భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి ఆది లోనే గ్రహణం పట్టుకుంది. ఈ ఏడాది జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులో 57,850 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 54,904 నోటీసులు జారీ చేసిన అధికారులు 423 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు. అయితే, భూభారతి దరఖాస్తుల్లో వచ్చిన వాటిల్లో 25 వేలు సాదాబైనామా, 16 వేల అసైన్డ్ దరఖాస్తులు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ అధి కారులు అంటున్నారు. ఇంకోవైపు సాదాబైనామా, పీఓటీల అంశం న్యాయస్థానం పరిధిలో ఉండడం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి మరో కారణమని చెబుతున్నారు. వచ్చిన 57,850 దరఖాస్తుల్లో సాదాబైనామా, అసైన్డ్ దరఖాస్తులు కలిపి 41 వేలు ఉండగా.. మిగిలిన 16,850 దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాల్సిన ఆ దిశగా అధి కారులు పనిచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టు 15వరకు ఈ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆ మేరకు రెవెన్యూ అధికారుల పనితీరు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. పంద్రాగస్టుకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడం, ఇప్పటికే సిబ్బంది కొరత ఉండడంతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీంతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా తరచూ వివిధ మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తూ సిబ్బంది పనితీరు తెలుసుకునే ప్రయత్నం చేశారు. భూభారతి దరఖాస్తులను పరిశీలించి త్వరగా క్లియర్ చేయాలని అధికారులు, సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న వర్ధన్నపేట మండలంలో వచ్చిన 2,917 దరఖాస్తుల్లో క్లియరైన వాటి సంఖ్య 50కి దాటకపోవడం గమనార్హం. భూరికార్డుల్లో పేర్ల తప్పులు, భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, వారసత్వ భూముల భూమార్పిడి, డిజిటల్ సంతకం, మ్యుటేషన్ పెండింగ్, భూ సర్వే నంబర్ లేకపోవడం తదితర భూసమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలన్న కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాలతో ఇప్పుడూ రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. పంద్రాగస్టులోపు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేసే దిశగా పనిచేస్తున్నారు. అయితే, సాదాబైనామా, అసైన్డ్ దరఖాస్తులు పోగా మిగిలిన 16,850 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 423 మాత్రమే పరిష్కరించిన అధికారులు మిగిలిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తే ప్రజలకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు తప్పనున్నాయి.
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఈనెల 15
జిల్లాలో 41వేలు సాదాబైనామా,
అసైన్డ్ అప్లికేషన్స్
మిగిలిన 16,850 అర్జీల్లో
క్లియరైనవి 423
క్షేత్రస్థాయిలో కలెక్టర్
డాక్టర్ సత్యశారద తనిఖీలు
ప్రజావాణిలో కూడా ఇవే ఫిర్యాదులు..
కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి కూడా భూసమస్యలపైనా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 133 దరఖాస్తులు వస్తే రెవెన్యూకు సంంబంధించినవే 49 ఉండడం గమనార్హం. ఇలా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావా ణికి వచ్చేవి రెవెన్యూ విభాగ సమస్యలే ఎక్కువగా ఉండడంతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీలు చేస్తున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు కారణాలేంటి అని లోతుగా ప్రశ్నిస్తున్నా రు. దీంతో భూభారతి దరఖాస్తుల పరిష్కారం కాస్త పట్టాలెక్కుతోంది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే చాలా వరకు భూసమస్యలు పరిష్కరం కానున్నాయి.