
ఆదివాసీల సంప్రదాయాలు కాపాడాలి
● కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట: ఆదివాసీల సంస్కృతీసంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ అమరవీరుల స్తూపం నుంచి పాకాల రోడ్డులోని కొమురంభీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద హాజరై కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికత నేర్పింది ఆదివాసీలేనన్నారు. ప్రకృతిని దైవంగా భావించే సంస్కృతి ఆదివాసీ గిరిజనులదన్నారు. గిరిజన సంస్కృతీసంప్రదాయాలపై డాక్యుమెంటేషన్ పక్కగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని 13 మారుమూల గిరిజన గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించడంతోపాటు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఆదివాసీల హక్కులను కాపాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు,.
అశోక్‌నగర్‌లోని కేజీబీవీ తనిఖీ
ఖానాపురం: అశోక్‌నగర్‌లోని కేజీబీవీని శనివారం కలెక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. స్టోర్‌రూం, పరిసరాలు పరిశీలించారు. ఫిర్యాదుల పెట్టెను తెరిచి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ సౌజన్య, ఎంఈఓ శ్రీదేవి, స్పెషల్ ఆఫీసర్ మేనక తదితరులు పాల్గొన్నారు.