
ఆయిల్ పామ్.. అధిక దిగుబడి
నర్సంపేట: ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు చూపుతున్నారు. మొక్కల దగ్గరి నుంచి మార్కెటింగ్ దాకా ప్రభుత్వం సహకారం అందిస్తుండడంతో జిల్లాలో ప్రతీ సంవత్సరం సాగు పెరుగుతోంది. జిల్లాలో 5,448 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. రైతులు ఈ పంటను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సాహం..
దేశంలో వంట నూనెల్లో ఎక్కువగా పామాయిల్ వాడుతున్న విషయం విదితమే. అయితే, డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా ఉత్పత్తి పెంచితే రైతులకు ఆదాయం పెరగడంతోపాటు దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుందన్న లక్ష్యంతో ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.193 ఉండగా రైతుల నుంచి రూ.20 మాత్రమే వసూలు చేస్తున్నారు. మిగతా రూ.173 90 శాతం ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా మొక్కలు నాటిన తర్వాత నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకంగా అందిస్తుంది.
సబ్సిడీపై డ్రిప్ పరికరాలు..
ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీలకు 90 శా తం, ఓసీ రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం, ఐదు ఎకరాలు దాటితే 80 శాతం వరకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తోంది. అంతేకాకుండా పంటను కొనుగోలు చేయడానికి జిల్లాకు ఒక ఆయిల్ కంపెనీకి ప్రభుత్వమే కాంట్రాక్టు ఇస్తోంది.
ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి..
ఆయిల్‌పామ్ మొక్కలు ఎకరాకు 55 వరకు నాటుతారు. మూడేళ్లు పూర్తయిన తర్వాత నాలుగో ఏడాది నుంచి 4 టన్నుల నుంచి 6 టన్నుల దిగుబడి మొదలవుతుంది. ఐదో సంవత్సరంలో 8 టన్నుల నుంచి 10 టన్నులు, ఆరో సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో 10 టన్నుల నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ దిగుబడి 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం టన్నుకు రూ.20 వేలు పలుకుతోంది. ఈ లెక్కన సగటున ఎకరాకు రూ.3 లక్షలు వచ్చినా రూ.లక్ష ఖర్చు పోగా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ మొక్కల మధ్య కూరగాయలు, ఆకు కూరలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. నాటు, టర్కీ, గిరిరాజ లాంటి కోళ్లు, పశువులను పెంచుకోవచ్చు.
నాలుగేళ్లు నిర్వహణ ఖర్చులు..
ఆయిల్‌పామ్ సాగు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తోంది. సబ్సిడీ కింద మొక్కలు, డ్రిప్ పరికరాలు అందించడమే కాకుండా నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తోంది. ఖానాపురంలో 380, చెన్నారావుపేట 390, నెక్కొండ 390 ఎకరాల్లో మూడేళ్లుగా పంట సాగు చేస్తున్నారు.
వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్
రైతులు వరి, పత్తి వంటి సంప్రదాయ పంటల మీదనే ఆధారపకుండా పంటల మార్పిడిపై దృష్టి సారించాలి. ఆయిల్‌పామ్ అనేది వరి, పత్తికి ఒక మంచి ప్రత్యామ్నాయ పంట. తక్కువ నీటితో, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట ఇది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకుని రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపాలి. రైతులకు ఆర్థికంగా మరింత భద్రతను ఇస్తుంది. పంట దిగుబడి, మార్కెటింగ్‌కు కూడా ప్రభుత్వమే పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుంది.
– శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి
జిల్లాలో మండలాల వారీగా మూడు సంవత్సరాల సాగు వివరాలు (ఎకరాల్లో)..
మండలం 2022–23 2023–24 2024–25
చెన్నారావుపేట 187 155 60
దుగ్గొండి 170 198 111
గీసుకొండ 102 116 66
ఖానాపురం 165 140 88
ఖిలా వరంగల్ 5 43 30
నల్లబెల్లి 104 153 59
నర్సంపేట 120 157 114
నెక్కొండ 224 103 22
పర్వతగిరి 644 297 70
రాయపర్తి 317 259 40
సంగెం 220 162 43
వరంగల్ 12 25 5
వర్ధన్నపేట 379 212 71
మొత్తం 2,649 2,020 779
30 సంవత్సరాల పాటు ఆదాయం
రైతులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం
జిల్లాలో 5,448 ఎకరాల్లో పంటసాగు

ఆయిల్ పామ్.. అధిక దిగుబడి

ఆయిల్ పామ్.. అధిక దిగుబడి