
భూనిర్వాసితులకు ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామం నుంచి వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అవార్డ్ పాస్ చేసేందుకు కలెక్టరేట్‌లో శుక్రవారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, నేషనల్ హైవే సైట్ ఇంజనీర్ ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు.
మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్..
హనుమకొండ బాలసముద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.
‘ఓపెన్’ డిగ్రీ,
పీజీ ప్రవేశాలకు గడువు
విద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ 2025–26 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర డిప్లొమా కోర్సుల అడ్మిషన్లకు ఈనెల 13 వరకు గడువు ఉందని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ రెండేళ్లు, ఐటీఐ, ఓపెన్ ఇంటర్ 10 ప్లస్ 2, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆసక్తి ఉన్న వారు ‘డబ్ల్యూడబ్ల్యూబీఆర్‌ఏఓయూ.ఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సంప్రదించి సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకున్న తర్వాత ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరారు. పీజీ కోర్సుల్లోని ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు.