
జిల్లాలో దంచికొట్టిన వాన
సాక్షి, వరంగల్: జిల్లాలో భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు గీసుకొండలో అత్యధికంగా 98.4 మిల్లీమీటర్లు, ఖిలావరంగల్ లో 68.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో వరంగల్ నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయమయయ్యాయి. రాత్రి వేళ వాహనదారులు ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది. వరంగల్‌లో 58.4 మిల్లీమీటర్లు, నెక్కొండలో 57.4, వర్ధన్నపేటలో 56.6, సంగెంలో 51.4, ఖానాపురంలో 48.4, నర్సంపేట 40.6, పర్వతగిరిలో 36.8, చెన్నారావుపేటలో 36.0, దుగ్గొండిలో 28.6, నల్లబెల్లిలో 24.2, రాయపర్తిలో 22.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ విభాగాధికారులు తెలిపారు.
వర్షంతో ఇల్లు నేలమట్టం..
నల్లబెల్లి: వర్షంతో రుద్రగూడెంలో బాషబోయిన భాస్కర్ ఇల్లు గురువారం అర్ధరాత్రి నేలమట్టమైంది. గమనించిన భాస్కర్‌తోపాటు కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి ఒక్కసారిగా పరుగు తీశారు. వారు బయటకు పరుగెత్తిన కొన్ని క్షణాల్లోనే ఇల్లు పూర్తిగా కూలింది. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణా పాయం తప్పింది. ఇల్లు కూలడంతో గృహోపయోగ సామగ్రి ధ్వంసమైంది. స్థానిక ఆర్‌ఐ కార్తీక్, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.