
మ్యుటేషన్ చేయడం లేదని నిరసన
వర్ధన్నపేట: మ్యుటేషన్ చేయడం లేదని కుటుంబ సభ్యులు ఏకంగా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వంటావార్పు చేసి నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం.. ఇల్లంద గ్రామానికి చెందిన నాంపల్లి కుమారస్వామి తండ్రి యాకయ్య గత నవంబర్‌లో మరణించాడు. ఆయన పేరుతో ఉన్న వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని కుమారస్వామి తెలిపాడు. అధికారుల తీరుపై విసుగుచెంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటా వార్పునకు సిద్ధమయ్యామని పేర్కొన్నాడు. దీంతో రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని త్వరితగతిన మ్యుటేషన్ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయంపై ఆర్‌ఐ ఆసిఫ్‌ను వివరణ కొరగా మ్యుటేషన్‌కు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించకపోవడంతోపాటు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం విచారణకు సహకరించకపోవడంతో ఆలస్యమైందని తెలిపారు.
అధికారుల హామీతో సద్దుమణిగిన వివాదం