
‘డబుల్’ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి గురువారం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బ్లాక్‌ల వారీగా తాగునీరు, విద్యుత్ తదితర వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, గృహ నిర్మాణశాఖ పీడీ సిద్ధార్థనాయక్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
డిమాండ్‌కు అనుగుణంగా చేనేత
ఉత్పత్తులు రావాలి..
డిమాండ్‌కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులు తీసుకురావాలని కలెక్టర్ స్నేహ శబరీష్ చేనేత కార్మికులకు సూచించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం కాళోజీ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు చేనేత నడక (హ్యాండ్లూమ్ వాక్) కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి జెండా ఊపి చేనేత నడకను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 800 మంది నేత కార్మికులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ కూడా చేసిందన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈసందర్భంగా చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. చేనేతపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలను సన్మానించారు. చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులు పరిష్కరించండి
భూభారతి సదస్సుల్లో భూసమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో భూభారతి దరఖాస్తుల విచారణ, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ ‘కుడా’ ఆఫీస్ సమీపంలోని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.