
తల్లిపాలతో ఆరోగ్యం
● వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఎంజీఎం/న్యూశాయంపేట/రామన్నపేట: తల్లిపాలు తాగితే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు బాలింతలు, గర్భిణులకు తల్లిపాల విశిష్టతను వివరిస్తూ వేసిన నాటకం ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, వైద్యాధికారులు సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు.