
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
డీఈఓ వాసంతి
వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. గురువారం మండలంలోని కేజీబీవీ, గొల్లకిష్టంపల్లి, కట్కూరు రామయ్యపల్లి, గురుకుల పాఠశాలలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని విద్యార్థుల్ని అడగ్గా నీటి సమస్య తీవ్రంగా ఉందని, బోరులో నుంచి నీరు రావడం లేదని, మిషన్ భగీరథ వాటర్ సరిపోవట్లేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే గురుకుల పాఠశాలలో క్లాస్ రూంలు, డైనింగ్ హాల్, స్టోర్ రూంను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్.. హాస్టల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, విద్యార్థులు వాడుకున్న నీరు బయటకు వెళ్లకుండా పాఠశాల ఆవరణలోనే ఉంటోందని చెప్పారు. శాశ్వత పరిష్కారం చూపేలా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎంఈఓ చంద్రమౌళి, కేజీబీవీ ఎస్‌ఓ స్రవంతి, గురుకుల ప్రిన్సిపాల్ అజయ్‌కుమార్, ఏఈ రూపావతి, తదితరులు పాల్గొన్నారు.