ఆరోగ్యానికి ‘కిషోర రక్ష’ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి ‘కిషోర రక్ష’

Aug 8 2025 6:58 AM | Updated on Aug 8 2025 6:58 AM

ఆరోగ్

ఆరోగ్యానికి ‘కిషోర రక్ష’

ఖానాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై కలెక్టర్‌ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయనున్నారు. గతంలో ఆర్‌బీఎస్‌కే ద్వారా వైద్యపరీక్షలు చేసినా పూర్తిస్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేసి దానికనుగుణంగానే వైద్యసేవలు అందించనున్నారు.

విద్యార్థులకు 13 రకాల పరీక్షలు..

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కలెక్టర్‌ ‘కిషోర రక్ష’ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. విద్యార్థులకు బ్లడ్‌గ్రూప్‌, దంత, చర్మవ్యాధులు, చెవి, క్యాన్సర్‌, జన్యులోపం, హిమోగ్లోబిన్‌తో పాటు మరో 13 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఇందులో థైరాయిడ్‌, టీబీతో పాటు ఇతర వ్యాధులు ఉన్నట్లు తేలితే నర్సంపేట పట్టణంలోని టీహబ్‌కు పంపించి పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నారు. సాధారణ వ్యాధులకు అయితే నర్సంపేట ఆస్పత్రిలో వైద్యసేవలు, మిగిలిన వ్యాధులకు వరంగల్‌, హైదరాబాద్‌కు రెఫర్‌ చేసి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య పరీక్షల్లో వచ్చిన వివరాలతో హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేసి ‘కిషోర రక్ష’ కార్డుల్లో నమోదు చేస్తున్నారు. విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిలో నమోదు చేసి నిత్యం వైద్య పరీక్షలు అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

ఇప్పటి వరకు 1,620 మందికి పరీక్షలు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థికి వైద్య పరీక్షలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 75 సంక్షేమ గురుకుల పాఠశాలలు, 545 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో భాగంగా మొదట కేజీబీవీల్లో శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 10 కేజీబీవీల్లో 2,501 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,620 మందికి వైద్య పరీక్షలు చేశారు. మిగిలిన విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో పరీక్షించలేకపోయారు. పరీక్షలు చేసిన వారిలో 58 మందికి మేజర్‌ సమస్యలను గుర్తించారు. వీరిని రెఫర్‌ చేయించి వైద్య పరీక్షలు అందించనున్నారు. కేజీబీవీల్లో ముగిసిన తర్వాత ఎంజేపీ, మోడల్‌ స్కూల్స్‌, సైనిక్‌, గిరిజన పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూళ్లలోనూ ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలెక్టర్‌ సత్యశారద పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలతో వైద్యపరీక్షలు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. వైద్యపరీక్షలు చేసి కిషోర రక్ష కార్డుల్లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీంతో మొదట కేజీబీవీల్లో అమలుకు శ్రీకారం చుట్టాం. తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో వైద్యపరీక్షలు చేసి విద్యార్థుల వివరాలు కార్డుల్లో పొందుపర్చి తల్లిదండ్రులకు అందజేస్తాం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

– సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ

విద్యార్థులపై కలెక్టర్‌ సత్యశారద

ప్రత్యేక శ్రద్ధ

పాఠశాలల్లో బాలబాలికలకు

వైద్య పరీక్షలు

హైల్త్‌ ప్రొఫెల్‌ తయారు చేసి

కార్డుల్లో నమోదు

మొదట కేజీబీవీల్లో అమలుకు శ్రీకారం

ఆరోగ్యానికి ‘కిషోర రక్ష’1
1/2

ఆరోగ్యానికి ‘కిషోర రక్ష’

ఆరోగ్యానికి ‘కిషోర రక్ష’2
2/2

ఆరోగ్యానికి ‘కిషోర రక్ష’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement