
గూడ్స్ వాహనాల బ్యాటరీలు మాయం
● మూడు ప్రాంతాల్లో అపహరణ
గీసుకొండ: గీసుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో దొంగలు గూడ్స్ వాహనాల బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని కావేరి వే బ్రిడ్జి సమీపంలో ధర్మారంకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ కిరాయికి ఉంటున్నాడు. నివాసం వద్ద తన లారీని నిలిపి ఉంచగా బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు లారీ బ్యాటరీని అపహరించుకుని తీసుకెళ్లారు. దాని విలువ సుమారు రూ. 15 వేలు ఉంటుందని అంచనా. అలాగే రెడ్డిపాలెం వద్ద దేవరపెల్లి రాజు తన డీసీఎం వాహనాన్ని నిలిపి ఇంటికి వెళ్లాడు. వచ్చి చూడగా మాయమైంది. దాని విలువ రూ.15వేలు ఉంటుంది. అలాగే హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ పక్కన ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ వద్ద చింతల్‌కు చెందిన మహ్మద్ అలీ తన లారీని పార్క్ చేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బ్యాటరీ విలువ సుమారు రూ.15 వేలు ఉంటుంది. ఈ వివరాల మేరకు గురువారం ముగ్గురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుమార్ తెలిపారు.
11న నులిపురుగుల నివారణ దినోత్సవం
గీసుకొండ: జిల్లాలో ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని చేపడుతున్నట్లు డీఎంహెచ్‌వో బి. సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ కార్యక్రమాన్ని 18న నిర్వహిస్తామని వివరించారు. జిల్లాలో 1,328 విద్యా సంస్థల్లో 96,214 మంది బాలురు, 99,954 మంది బాలికుల చదువుతున్నారని తెలిపారు. వారందరికీ అల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 1–2 ఏళ్ల చిన్నారులకు సగం.. ఆ పైన 19 ఏళ్ల వరకు వయస్సు ఉన్న వారికి మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆటోను ఢీకొట్టిన లారీ
వర్ధన్నపేట: ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణ కేంద్రం నుంచి ప్రయాణికులతో నందనం వైపు వెళ్తున్న ఆటోను కరీంనగర్ నుంచి బూడిద లోడ్‌తో వస్తున్న లారీ అంబేద్కర్ సర్కిల్ ప్రాంతంలో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న ఎనిమిది మందికి స్వల్ప గాయాలు కాగా ఇల్లంద గ్రామానికి చెందిన సంజనకు మాత్రం తీవ్రగాయాలు కాగా వెంటనే బాలికను పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మద్యం మత్తులో
కత్తితో వ్యక్తి హల్‌చల్
వర్ధన్నపేట : మండలంలోని ఉప్పరపల్లి క్రాస్‌లోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద గురువారం మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి పై కత్తులు, రాళ్లు, కర్రలతో వాహనదారులు, స్థాని క గ్రామస్తులపై దాడికి యత్నించాడు. రెండు గంటల పాటు హంగామా చేసి వాహనదారులను పరుగులు పెట్టించాడు. అడ్డుకునేందుకు వెళ్లిన వారి పై రాళ్లు విసురుతూ కత్తి చేత పట్టుకొని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంత జరిగినా గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోటలో విదేశీయుల సందడి
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను గురువారం ఇటలీ దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా మధ్య కోటలోని కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్‌మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్ట, శృంగారపు బావిని తిలకించారు. శిల్పాల ప్రాంగణంలో నాటి శిల్పులు చెక్కిన అద్భుత శిల్ప సంపదను ఆసక్తిగా పరిశీలించారు. క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి కాకతీయుల చరిత్ర, విశిష్టత తెలుసుకున్నారు. కోట విశిష్టతను పర్యాటశాఖ గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు విదేశీయుల వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్‌చార్జ్ అజయ్ ఉన్నారు.

గూడ్స్ వాహనాల బ్యాటరీలు మాయం