
బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలి
నర్సంపేట: ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను, ఎస్సీ కుల వర్గీకరణకు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చి బేషరతుగా బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంపుదల, ఎస్సీ కులాల వర్గీకరణకు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసి ఆమోదం పొందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశంలో కులగనను చేపట్టాలన్నారు. సామాజికంగా అణచివేతకు గురవుతున్న కులాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని, ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లును సైతం ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే కాలంలో బీసీ, ఎస్సీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు జక్కుల తిరుపతి, బరిగల కుమార్, గొర్రె ప్రదీప్, ఐఎఫ్‌టీయూ నాయకులు కొత్తూరు రవి, గొల్లన అశోక్, తదితరులు పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజేందర్