
ఆర్టీసీ పండుగల ప్రత్యేకం
హన్మకొండ: వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ పెరగనుండడంతో టీజీఎస్‌ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రయాణికులను సురక్షితంగా, సుఖవంతంగా గమ్యస్థానా లకు చేరవేసేందుకు ఐదు రోజులు ప్రత్యేక బస్సులు నడుపనుంది. ప్రయాణికులు ప్రైవేటు వాహనా ల్లో వెళ్లకుండా నియంత్రించడంతో పాటు ఆర్టీసీకి ఆదాయాన్ని రాబట్టుకోవడం..సురక్షితంగా ప్రయాణికులను చేరవేసేందుకు పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 8న వరలక్ష్మి వ్రతం, 9న రాఖీ పౌర్ణమి కావడంతో పాటు 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సొంతూళ్లకు బయలుదేరుతారు. దీంతో ప్రయాణికుల రద్దీ పెరుగనుండడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. హనుమకొండ బస్ స్టేషన్, ఉప్పల్ పాయింట్‌లో ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి, అవసరాన్ని బట్టి బస్సులు సమకూర్చడానికి 24 గంటలు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్ పాయింట్‌లో టెంట్లు, తాగునీటి సదుపాయం, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. హనుమకొండ–హైదరాబాద్ ఉప్పల్ రూట్‌తో పాటు వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలోని బస్ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీని అనుసరించి అదనపు బస్సులు నడిపేలా అధికారులు సమాయత్తమయ్యారు.
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యం. ఈ దిశగా వరలక్ష్మివ్రతం, రాఖీ పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, క్షేమంగా గమ్యస్థానా లకు చేరేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. రీజియన్ పరిధిలోని సోదరసోదరీమణులంతా ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
–డి.విజయభాను, ఆర్టీసీ ఆర్‌ఎం
వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమికి
పెరగనున్న రద్దీ
నేటి నుంచి ఐదు రోజుల పాటు
ప్రత్యేక బస్సులు
వరంగల్ రీజియన్‌లో9 డిపోల నుంచి
హైదరాబాద్‌కు బస్సుల పెంపు