
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి
హన్మకొండ అర్బన్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి క్షమాదేశ్ పాండే అన్నారు. బుధవారం జులైవాడలో ప్రభుత్వ బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన లీగల్ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు..బాలికలు చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని, అందుకు తగినట్లుగా ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాయని తెలిపారు. కార్యక్రమంలో ఆశా యూనిట్ మెంబర్ పి.శ్రీనివాస్, సీడబ్ల్యూసీ మెంబర్ దామోదర్, హెచ్‌ఎం రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
రేపు పాలిసెట్
స్పాట్ అడ్మిషన్లు
రామన్నపేట: టీజీ పాలిసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 8న(శుక్రవారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, టీజీ పాలిసెట్ హెల్ప్‌లైన్ సెంటర్, వరంగల్ క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పాట్ అడ్మిషన్లకు టీజీ పాలిసెట్–2025లో అర్హత పొందిన, పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో వివిధ కేటగిరీల్లో మిగిలి ఉన్న 28 సీట్లకు ఈ అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 8న ఉదయం 10 గంటల వరకు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాలని పేర్కొన్నారు. విద్యార్థులు వారి వెంట టీసీ, ఎస్సెస్సీ మెమో, స్టడీ, కుల సర్టిఫికెట్స్, ఆధార్‌కార్డు, టీజీ పాలిసెట్–2025 ర్యాంక్ కార్డు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలు తీసుకొని రావాలని కోరారు. వివరాలకు http://tgpolycet.nic.in వెబ్‌సైట్ సందర్శించాలని వివరించారు.