
కుట్రలో భాగమే కాళేశ్వరంపై దుష్ప్రచారం
మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్,
పెద్ది సుదర్శన్‌రెడ్డి
హన్మకొండ: కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ నాయకులు కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే.. కేసీఆర్ మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని రుజువు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తుంటే మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించారన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమేనని.. జడ్జిమెంట్ కాదన్నారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కుంగితే ప్రభుత్వ పెద్దదే బాధ్యత అయితే... సివిల్ సప్లై శాఖలో రూ.1100 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ చేసినట్లేనా నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు చెన్నం మధు, నర్సింగరావు, జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, హరి రమాదేవి పాల్గొన్నారు.