
వంగర పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో సందర్శన
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలోని వంగర పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎ.అప్పయ్య బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. అలాగే ఎన్‌సీడీ స్క్రీనింగ్, ఫీవర్ సర్వే, డ్రైడే కార్యక్రమం, తల్లిపాల ప్రాముఖ్యం గురించి గర్భిణులకు సిబ్బంది వివరిస్తున్న తీరును, పోషణ లోపం ఉన్న పిల్లలను ఏవిధంగా మానిటరింగ్ చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు ఆరోగ్య కేంద్రాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను సిబ్బంది డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా బీపీ, షుగర్ ట్రీట్‌మెంట్ ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మళ్లించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పీహెచ్‌సీలోని బిల్డింగ్‌ను, రూఫ్ నుంచి నీరు లీకయ్యే ప్రదేశాలను డీఎంహెచ్‌వో పరిశీలించారు. ఆయన వెంట జిల్లా వైద్య అధికారులతో పాటు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రహమాన్, డాక్టర్లు రుబీన అఫ్రోజ్, రాజశేఖర్, జ్యోతి, అరుణ, ఆశా కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు.