
ఆగస్టుపైనే ఆశలు
సాక్షి, వరంగల్: జిల్లాపై వరుణుడు కరుణిస్తేనే చెరువులు, కుంటలు, వాగులు నిండనున్నాయి. ఈ ఏడాది జూన్‌లో 26 శాతం లోటు వర్షపాతం ఉండగా.. జూలైలో అదనంగా 15 శాతం వర్షం కురవడంతో 11 శాతం లోటు ఉంది. ఆగస్టు నెలలో సాధారణం మించి వర్షాలు కురిస్తే లోటు వర్షపాతం లెక్క సరిపోతుంది. ఫలితంగా చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకుని పంటలు పండుతాయి. భూగర్భ జలాలు పెరిగే అవకాశముంటుంది. గతేడాది ఆగస్టు మాదిరిగానే లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడు ఇబ్బందులు తప్పవని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 251.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఈ నెల నాలుగో తేదీ వరకు 36.7 మిల్లీమీటర్లు కురిసింది. ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు కురిసి సాధారణ వర్షపాతం మించాలని, గతేడాది మాదిరిగానే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైతే చెరువులు, కుంటలు నిండుకుండలా మారనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, నర్సంపేట, గీసుకొండ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు ఎక్కువగా కురవాలని రైతులు పూజలు చేస్తున్నారు.
జూలైలో 15 శాతం ఎక్కువ..
జూన్‌లో 153.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 113.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో 271.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 312.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్‌లో 26 శాతం లోటు వర్షపాతం ఉండగా, జూలైలో 15 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆగస్టు ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు 37.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 36.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నర్సంపేట, పర్వతగిరి, నెక్కొండ మినహాయించి మిగిలిన మండలాల్లో లోటు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
గతేడాదితో పోల్చినా లోటు వర్షపాతమే..
జూన్‌లో 154.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 188.2 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో 273.2 మిల్లీమీటర్లకు 299.4 మిల్లీమీటర్లు, ఆగస్టులో 251.9 మిల్లీమీటర్లకు 181.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. సెప్టెంబర్ నెలలో 175 మిల్లీమీటర్లకు 367.4 మిల్లీమీటర్లు కురిసింది. అంటే 2024–25 సంవత్సరంలో జూన్, జూలై నెలలో 487.6 మిల్లీమీటర్లు కురిస్తే ఈ ఏడాది జూన్, జూలై నెలలో 426.7 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఈ లెక్కన చూసుకుంటే 12 శాతం లోటు వర్షపాతం ఉంది.
వరుణుడు కరుణిస్తేనే లోటు వర్షపాతం అధిగమించే అవకాశం
జూన్‌లో తక్కువ, జూలైలో
ఎక్కువగా కురిసిన వర్షాలు
ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు నాలుగు వరకు వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)..
లోటు వర్షపాతం ఎక్కడంటే..
మండలం కురవాల్సింది కురిసింది
వరంగల్ 460.3 420
ఖిలా వరంగల్ 455.8 336.7
పర్వతగిరి 423.1 420.6
రాయపర్తి 376.9 250.2
సంగెం 455.4 438.5
నర్సంపేట 527.3 516
గీసుకొండ 452.9 442.9
ఎక్కువగా నమోదైన వర్షపాతం వివరాలు
దుగ్గొండి 442.9 472.1
నల్లబెల్లి 513.2 515.8
ఖానాపురం 554.9 642.6
చెన్నారావుపేట 515.2 682.1
వర్ధన్నపేట 333.3 369.3
నెక్కొండ 503.4 520