
భూ భారతి దరఖాస్తులు పరిశీలించాలి
నెక్కొండ: భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో డిప్యూటీ తహసీల్దార్ రవి కార్యాలయంలో లేకపోవడంతో కలెక్టర్ మెమో జారీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆమె పరిశీలించి మాట్లాడుతూ పర్సనల్, మూమెంట్ రిజిస్టర్లు నిర్వహించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 15లోగా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు భూ భారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. పాత రికార్డులను సైతం క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పూర్తి చేయాలని ఆమె సూచించారు. దరఖాస్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఏఓ ఫణికుమార్, డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
పర్వతగిరి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
పర్వతగిరి: తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ భారతి దరఖాస్తులు పరిశీలించేందుకు గడువు ఆగస్టు 15 వరకు ఉందని తెలిపారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి పాత రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి గురువారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఏఓలు ఫణికుమార్, డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద