వర్ధన్నపేట: అప్పు తీరిందని బ్యాంకుకు వెళ్లిన మహిళా సంఘం సభ్యులు.. అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో కంగుతిన్నారు. బాధిత మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. డీసీ తండా పరిధిలోని శ్రీతులసి మహిళా సంఘంలో 12 మంది సభ్యులు బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నారు. ఇందులో రూ.8 లక్షలు 12 మంది సభ్యులు పంచుకోగా.. మిగిలిన రూ.2 లక్షలు మాత్రం సంఘం అధ్యక్షురాలు ఆంగోత్ అమ్మి, సీఓ ఆంగోత్ సరిత వ్యక్తిగతంగా వాడుకున్నారని తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి సభ్యులు తీసుకున్న రుణం రూ.8 లక్షలకు వడ్డీతో కలిపి రూ.9.40 లక్షలు బ్యాంకు చెల్లించామని, మళ్లీ ఇప్పుడు రుణం కావాలని బ్యాంకుకు వెళ్లి అడిగామని పేర్కొన్నారు. ఇంకా రూ.2 లక్షలు అసలు, వడ్డీతో కలిపి మొత్తం రూ.4.40 లక్షలు చెల్లిస్తేనే మళ్లీ రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో కంగుతిన్న సభ్యులు సీఓను బ్యాంకుకు తీసుకొచ్చి బ్యాంకు అధికారులను స్టేట్‌మెంట్ అడుగగా రూ.10 లక్షలు రుణం తీసుకున్నట్లు తెలిపారు. రూ.2 లక్షలు ఎవరు వాడుకున్నారని అధ్యక్షురాలిని గట్టిగా నిలదీశారు. రూ.2 లక్షలు తానే వాడుకున్నట్లు మళ్లీ చెల్లిస్తానని అధ్యక్షురాలు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో సీఓ హస్తం కూడా ఉందని పేర్కొన్నారు. వెంటనే అధ్యక్షురాలు, సీఓపై చర్య తీసుకోవాలని వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన
మహిళా సంఘం సభ్యులు