
పుట్టగొడుగుల పెంపకం లాభదాయకం
● డీఆర్‌డీఓ కౌసల్యాదేవి ● దుగ్గొండిలో శిక్షణ శిబిరం పరిశీలన
దుగ్గొండి: అధిక పోషక విలువలు ఉన్న పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా ఉంటుందని డీఆర్‌డీఓ కౌసల్యాదేవి అన్నారు. మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో ఉన్నతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 10 రోజుల శిక్షణ శిబిరాన్ని ఆమె బుధవారం పరిశీలించి మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధితో మరింత ముందుకు సాగాలన్నారు. ఉపాధిలో 100 రోజులు పనిచేసిన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతితోపాటు రోజుకు రూ.307 చొప్పున ఉపాధి పథకంలో భాగంగా చెల్లించనున్నట్లు వివరించారు. నైపుణ్య శిక్షణ పొందిన వారికి లక్‌పతి దీదీ పథకం కింద రూ.ఐదు లక్షల రుణం అందించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అనంతరం చాపలబండ, అడవిరంగాపురం గ్రామాల్లో పండ్ల తోటలు, గ్రామ నర్సరీలు, పశువుల షెడ్లను ఆమె పరిశీలించారు. అదనపు పీడీ రేణుక, డీపీఎం సుజాత, ఎంపీడీఓ అరుంధతి, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం రమేశ్, ట్రైనర్ బాలస్వామి, మొగిలి పాల్గొన్నారు.