
మా బడికి బస్సొచ్చిందోచ్!
● వంచనగిరి మోడల్ స్కూల్ విద్యార్థుల హర్షం
● కలెక్టర్ ఆదేశాలతో వరంగల్ నుంచి ప్రారంభం
● ఫలించిన ప్రిన్సిపాల్ సునీత ప్రయత్నం
గీసుకొండ: మండలంలోని వంచనగరి మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీకి హనుమకొండ డిపో నుంచి బస్సు సౌకర్యం కల్పించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు వరంగల్ బస్టాండ్ నుంచి బయలుదేరి పలు స్టాపుల్లో మోడల్ స్కూల్ విద్యార్థులను తీసుకుని వంచనగిరి రైల్వేగేట్ వద్దకు చేరుకుంది. అక్కడ విద్యార్థులు బస్సు దిగి సమీపంలోని మోడల్ స్కూల్‌కు వెళ్లారు. బస్సు సౌకర్యం కల్పించాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత ఇటీవల కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో కలెక్టర్ స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో ప్రిన్సిపాల్‌తోపాటు కలెక్టర్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. వంచనగిరి రైల్వేగేట్ అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేసి స్కూల్ వరకు బస్సు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.