
నేటినుంచి రాష్ట్ర స్థాయి జూడో పోటీలు
రామన్నపేట : వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలోని కెమిస్టు అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో మంగళవారంనుంచి రెండు రోజులపాటు సబ్‌జూనియర్, క్యాడేట్ విభాగంలో రాష్ట్రస్థాయి జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కై లాష్ యాదవ్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల వివరాలు వెల్లడించారు. సబ్‌జూనియర్ విభాగంలో పాల్గొనే అభ్యర్థులు 2011, 2012, 2013 సంవత్సరాల్లో జన్మించి ఉండి బాలుర విభాగంలో 30 నుంచి66 కేజీల లోపు, బాలిక విభాగంలో 28 నుంచి 57 కేజీల లోపు ఉండాలని పేర్కొన్నారు. క్యాడేట్ విభాగంలో పాల్గొనే బాలురు 2008, 2009, 2010లో జన్మించి 50 నుంచి 90 కేజీల లోపు ఉండాలని, బాలిక విభాగంలో 40 నుంచి 70 కేజీల లోపు ఉండాలని తెలిపారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కమారస్వామి, సోమరాజు, దుపాకి సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కంచ నర్సింగరావుకు
చేనేత అవార్డు
ఖిలా వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డుకు ఎంపికైన కంచ నర్సింగరావును సోమవారం టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు అభినందించారు. నగరంలోని ఉర్సు కరీమాబాద్‌లో నర్సింగరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించారు. నర్సింగరావు నిలువు మగ్గం మీద పంజా కార్పెట్‌పై 4 తాబేళ్ల బొమ్మలు నేసి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు. దీంతో ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డుకు ఎంపిక చేసింది. ఈనెల 7న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లా జాలో జరిగే జాతీయ చేనేత దినోత్సవం వేడుకల్లో ఆశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా అవార్డుతోపాటు రూ.25వేల నగదు, ప్రశంసపత్రం అందుకోనున్నారు. కార్యక్రమంలో బాసాని కరుణాకర్, రాజశేఖర్, సమత పాల్గొన్నారు.
ఆరోగ్య కార్యక్రమాల
లక్ష్యాలు చేరుకోవాలి
ఎంజీఎం: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవాలని హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం నగరంలోని న్యూశాయంపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ పరిధిలోని ప్రాంతాల్లో డ్రైడే కార్యక్రమం అమలు, ఏఎన్‌సీ నమోదు, ఎన్‌సీడీ రీస్క్రీనింగ్, పాఠశాలలు, హాస్టళ్లలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డెమో అశోక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పశ్చిమలో అభివృద్ధి
పరుగులు : ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం 51వ డివిజన్ హనుమకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌజ్ ప్రాంతంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి కార్పొరేటర్ బోయినిపల్లి రంజిత్‌రావుతో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వరంగల్ మహానగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఈక్రమంలో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొండ నాగరాజు, నాయకులు రవినాయక్, పోలేపెల్లి బుచ్చిరెడ్డి, కాలనీ వాసులు వీరారెడ్డి, మాధవారెడ్డి, వడ్డే రవీందర్, జయశ్రీ పాల్గొన్నారు.

నేటినుంచి రాష్ట్ర స్థాయి జూడో పోటీలు

నేటినుంచి రాష్ట్ర స్థాయి జూడో పోటీలు