
నడవలేను..ఎక్కడికీ వెళ్లలేను
‘నడవలేను..ఒకరి సహాయం లేకుండా ఎక్కడికీ వెళ్లలేను..’ అని తనకు ట్రైసైకిల్ అందించి ఆదుకోవాలని హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మోరె మొగిలి అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పదహేను సంవత్సరాల క్రితం నరాలు చచ్చుబడటంతో తన కుడిచేయి పనిచేయడం లేదని, అనేక ఆసుపత్రులకు తిరిగినా నయం కాలేదని మొగిలి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయంతో పాటు ఇతరత్రా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడినని వివరించారు. తనకు ముగ్గురు కుమారులు, ఒక కూతురని అందరికీ పెళ్లిలు అయ్యాయన్నారు. నరాలు చచ్చుబడటంతో ప్రస్తుతం ఒకరి సహాయం లేకుండా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. చిన్న దుకాణం పెట్టుకొని వెళ్లదీస్తున్నానని, సరుకులు తెచ్చుకోవడానికి ఒకరిపై ఆధారపడాల్సి వస్తోందని, ట్రైసైకిల్ ఇప్పించి తనను అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.