యూరియా కోసం బారులు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం బారులు

Aug 5 2025 6:08 AM | Updated on Aug 5 2025 6:08 AM

యూరియ

యూరియా కోసం బారులు

ఖానాపురం: యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడంలేదు. సొసైటీ గోదాంల వద్ద బారులుదీరుతున్నారు. మండలంలోని బుధరావుపేటలోని గోదాం వద్ద యూరియా కోసం ఉదయాన్నే రైతులు బారులుదీరారు. గోదాంకు 444 బస్తాల దొడ్డు యూరియా ఆదివారం సాయంత్రం వచ్చింది. దీంతో బుధరావు పేట, మంగళవారి పేట, నాజీతండా, వేపచెట్టు తండాతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఉదయమే గోదాంకు వచ్చారు. మహిళలు, పురుషులు వేర్వేరు లైన్లలో నిలబడగా, మొదటగా మహిళలకు అవకాశం లభించకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో పాటు యూరియాను కొంతమేర పంపిణీ చేసి నిలిపివేయడంతో రైతులు ఆగ్రహించారు. ఈ క్రమంలో ఎస్సై రఘుపతి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసుల పహారా నడుమ ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 222 మందికి యూరియా పంపిణీ చేశారు. దాంతో యూరియా నిల్వలు అయిపోవడంతో మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు యూరియా కోసం భారీగా బారులుదీరారు. దీనికి తోడు పదిరోజుల నుంచి సొసైటీ పరిధికి యూరియా నిల్వలు రాలేదు. సోమవారం గోదాం వద్ద బారులుదీరినప్పటికీ యూరియా లభించకపోవడంతో బుధరావుపేట శివారులో జాతీయ రహదారి –365పై రైతులు రాస్తారోకో చేపట్టారు. జిల్లా అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైతుల వద్దకు వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, ఎస్సై రఘుపతి వచ్చి యూరియా నిల్వలు వచ్చిన తర్వాత అందరికీ పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ బాదావత్‌ బాలకిషన్‌ మాట్లాడుతూ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతులు బోడ కిషన్‌నాయక్‌, భిక్షపతి, బాలకిషన్‌, బాల, రమేష్‌, రాజు, మహిళా రైతులు మంగమ్మ, కేలోతు సరోజన, లావుడ్య సరోజన, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు. కాగా, రైతుల ధర్నాతో స్పందించిన అధికారులు బుధరావుపేట గోదాంకు 888 బస్తాల యూరియాను సోమవారం సాయంత్రం దిగుమతి చేయించారు. ఆ యూరియాను మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ వివరించారు.

222 మందికి మాత్రమే పంపిణీ

నిరాశతో వెనుదిరిగిన పలువురు రైతులు

జాతీయ రహదారిపై ఆందోళన

బుధరావుపేట గోదాంకు మరో

888 బస్తాల యూరియా రాక

యూరియా కోసం బారులు1
1/1

యూరియా కోసం బారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement