
సమయపాలన పాటించాలి
న్యూశాయంపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పదిన్నరకే సమావేశ మందిరానికి వచ్చిన కలెక్టర్.. సమయానికి రాని అధికారులు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణికి మొత్తం 133 అర్జీలు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించినవి 49 అర్జీలు, హౌసింగ్‌కు 34 దరఖాస్తులు రాగా, మిగితావి వివిధ శాఖలకు చెందిన వినతులు 50 వచ్చినట్లు అధికారులు వివరించారు.
స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతిరోజూ ఫీల్డ్ విజిట్ చేసి, సంక్షేమ పథకాల పురోగతి పరిశీలించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. నివేదికలు ఎప్పటికప్పుడు గూగుల్ ష్ప్రెడ్ సీట్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ శాఖల పాఠశాలలు, హాస్టళ్లలో నాణ్యమైన విద్య, ఆహారం అందించడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రెడ్‌క్రాస్ సొసైటీలో మెంబర్‌షిప్ తీసుకోవాలి
రెడ్‌క్రాస్ సొసైటీలో మెంబర్‌షిప్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. మెంబర్‌షిప్‌నకు నోడల్ అధికారిగా డీసీఓ నీరజ వ్యవరిస్తారని చెప్పారు. చేనేత లక్ష్మి స్కీం పథకంలో భాగస్వాములు కావాలన్నారు. జిల్లా అధికారులు అనురాధ, కల్పన, నీరజ, ఏఓ విశ్వప్రసాద్, చేనేతజౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీకాంత్‌రెడ్డి, టెస్కో డీఎంఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఆలస్యంగా వచ్చిన అధికారులపై
కలెక్టర్ సత్యశారద ఆగ్రహం
ప్రజావాణిలో వినతుల స్వీకరణ