
లక్ష్యసాధనకు కృషి చేయాలి
న్యూశాయంపేట: వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి లక్ష్యసాధనకు ప్రణాళికాబద్ధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా వన మహోత్సవంలో నాటాల్సిన మొక్కల లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. జిల్లా లక్ష్యం 31,40,272 కాగా, ఇప్పటివరకు 10లక్షల 87వేల 11 మొక్కలు నాటి, 9లక్షల 8వేల 272 మొక్కలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. 5లక్షల 61వేల 115 మొక్కలు ఇంటింటికి పంపిణీ చేసినట్లు వివరించారు. కిచెన్ షెడ్స్, అశోక, బోగెన్విలియన్, ఉసిరి, కరివేపాకు, గోరింటాకు, కలబంద ముఖ్యంగా అవకాడో, వేప, రాల చెట్టు, జామ, సీతాఫలం మామిడి తదితర చెట్లను నాటాలని చెప్పారు. తదుపరి సమావేశం నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో
కలెక్టర్ సత్యశారద