
ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
నర్సంపేట రూరల్: అంతర్జాతీయ తల్లిపాల వారో త్సవాలను నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలో గైనిక్ వార్డులను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అందంగా ముస్తాబు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, ఐసీడీఎస్ సీడీపీఓ మధురమ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి ముర్రుపాలు తాగించాలని సూచించారు. ఈ పాలు శిశువుకు దివ్యౌషధంగా పనిచేస్తాయని చెప్పా రు. ఈ పాలతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని తెలిపారు. ఆరునెలల తర్వాత అనుబంధ ఆహారంతోపాటు తల్లిపాలు కూడా అందించాలని చెప్పారు. ఇలా బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని అన్నారు. అనంతరం ఆస్పత్రిలోని 25మంది తల్లులకు బ్రెడ్స్, పండ్లు పంపిణీ చేశారు. గైనకాలజిస్టులు, వైద్యులు నిర్మల, నవత, ప్రతాప్, సుభాన్, హెచ్‌ఈ వసంత, ఏఎన్‌ఎం కవి త, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.