
ఫిరాయింపుదారులపై చర్య తీసుకోవాలి
ధర్మసాగర్: ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని స్థితిలో కడియం శ్రీహరి ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి, పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగం మేరకు తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆలస్యం చేయకుండా.. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, ఇది రాజ్యాంగ పరిరక్షణకు గట్టి మద్దతు అని చెప్పారు. కడియం శ్రీహరి తనతో పాటు 25 మంది ఎమ్మెల్యేలతో వస్తానని తాను మంత్రినవుతానని ఆశలు పెట్టుకున్నాడు కానీ.. ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వ్యవహారాలని రాజయ్య విమర్శించారు. స్పీకర్ తక్షణమే రాజ్యాంగం మేరకు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆ పదవికి రాజీనామా చేయడం మంచిదవుతుందని తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల ఇన్‌చార్జ్ కర్ర సోమిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు ప్రభుదాస్, మామిడి రవీందర్, బేరే మధుకర్, బొడ్డు ప్రతాప్, రేమిడి మహేందర్‌రెడ్డి, మేకల విజయ్‌కుమార్, దంతూరి బాలరాజు, బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
తాటికొండ రాజయ్య