ప్రజావాణిలో
అర్జీదారుల వేడుకోలు
● తక్షణమే పరిష్కారం చూపాలి.. అర్జీదారులను గౌరవించాలి
● అధికారులకు కలెక్టర్ సత్యశారద ఆదేశం
● గ్రీవెన్స్‌కు 94 దరఖాస్తులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగురాలి పేరు బి.కల్పన. ఈమెది దుగ్గొండి మండలం లక్ష్మీపురం. 90 శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆమె తండ్రికి ప్రభుత్వ పెన్షన్ ఉందన్న కారణంతో ఈమెకు పింఛన్ తిరస్కరించారు. రుమాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న ఈమె ప్రతీ నెల రూ.2,500 మందుల కోసం ఖర్చు చేస్తోంది. ఆమె తండ్రి క్యాన్సర్ పేషెంట్. తల్లి నడుం నొప్పితో బాధపడుతోంది. తండ్రికొచ్చే పెన్షన్ మొత్తం ఆస్పత్రి ఖర్చులకే సరిపోతోందని.. బతకడం కష్టంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను బీఈడీ పూర్తి చేసి టెట్‌లో అర్హత సాధించానని.. తనపై కనికరం చూపి జీవనభృతి కల్పించాలని వేడుకుంటోంది.
ఇలా.. దివ్యాంగురాలు కల్పన ఒక్కరే కాదు. ప్రజావాణిలో ఆమెలాంటి ఎందరో సోమవారం అర్జీలు పెట్టుకుంటున్నారు. అధికారులు వినతులు స్వీకరిస్తున్నారు. పరిష్కారం చూపడంలో మాత్రం జాప్యం జరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి.. ఫిర్యాదుదారులను గౌరవించాలి అని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణి డీఆర్‌ఓ విజయలక్ష్మితో కలిసి పలు సమస్యలపై 94 దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సీఎం ప్రజావాణి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో రెవెన్యూశాఖకు సంబంధించి 20, పోలీసు శాఖకు 11, వైద్య ఆరోగ్యశాఖ 7, పౌర సరఫరాల శాఖ 7, కలెక్టరేట్ 6, జీడబ్ల్యూఎంసీ–6, విద్యాశాఖ–4 దరఖాస్తులతో పాటు వివిధ శాఖలకు సంబంధించి పలు సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
వేసవి పనులపై అధికారులతో సమీక్ష
కలెక్టర్ సత్యశారద మండల ప్రత్యేకాధికారులతో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చేపడుతున్న చర్యలు, విద్యుత్ సరఫరా, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి తదితరులున్నారు.