
మాట్లాడుతున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
హన్మకొండ అర్బన్: ఈనెల 30న ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీపీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 5,81,124 మంది ఓటర్లున్నారని వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో సమాచార స్లిప్‌ల పంపిణీ 92.35 శాతం పూర్తయిందన్నారు. ఈనెల 29 వరకు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఉందని, వినియోగించుకోవాలని కోరా రు. సీపీ మాట్లాడుతూ.. పోలింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు, జిల్లాలో 484 పోలింగ్ కేంద్రాలుండగా.. వాటిలో 68 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
అందరూ సహకరించాలి: కలెక్టర్ ప్రావీణ్య
కరీమాబాద్: పోలింగ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రశాంత పోలింగ్‌కు అందరూ సహకరించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చర్యలు వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డీపీఆర్‌ఓ ఆయుబ్‌అలీ, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వనారాయణ పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ పూర్తి
జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌లకు సంబంధించిన మూడో ర్యాండమేజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షణ్ముఘరాజన్ పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులతో..
ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకపోతే 12 రకాల ప్రత్యామ్యాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్

పోలింగ్ ఏర్పాట్లు వివరిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య