● ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికపై సమీక్ష
సాక్షి, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం మహబూబాబాద్‌లో ఉమ్మడి జిల్లా అధికారుల సమావేశం జరగనుంది. సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు, ముఖ్య అధికారులు పాల్గొననున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో వందరోజుల ప్రణాళికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాన్ని కింది స్థాయి అధికారులకు చేరవేయడం, ఇందులోని ముఖ్యాంశాలను నేడు జరిగే సమావేశంలో వివరించనున్నారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ
హసన్‌పర్తి: హసన్‌పర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, భీమారంలోని శ్రీసాయి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ ఎన్.రవి తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ కిరణ్‌కుమార్, తదితరులున్నారు.
ఇంటర్‌లో 441 మంది గైర్హాజరు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 441 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 52 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 18,198 మంది పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. 17,757 మంది (98శాతం) విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు.
నేడు బహిరంగ విచారణ
హన్మకొండ: విద్యుత్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 6న బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బహిరంగ విచారణకు ఏర్పాట్లు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌లో ఈ విచారణ చేపట్టనున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో వివరించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజ్ నాగార్జున్, సభ్యులు రఘు కంజర్ల, సీహెచ్.శ్రీనివాస్‌రావు పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరు కావాలని కోరారు.
పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గురువారం ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. సుబేదారిలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఒకరు కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డీబార్ అయినట్లు కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్ తెలిపారు.


