● పాములు, కుక్కల బెడద
● ఇప్పటికే ముగ్గురు విద్యార్థులపై
ఎలుకల దాడి
● భయాందోళనలో విద్యార్థినులు
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ బాలిక గురుకుల విద్యాలయం అసౌకర్యాల మధ్య కొనసాగుతోంది. 45 ఏళ్ల క్రితం గురుకుల పాఠశాల భవనాలు నిర్మించారు. ప్రస్తుతం కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్త గదులు నిర్మించాలని పేరెంట్స్ నుంచి డిమాండ్ వ్యక్తమైంది. జిల్లా ఉన్నతాఽధికారులు, ప్రజాప్రతినిధులు సైతం గురుకులాన్ని సందర్శించిననప్పుడు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.
భారీ వర్షాలు కురిస్తే..
పాఠశాల గదులు శిథిలావస్థకు చేరి పైపెచ్చులు ఊ డుతున్నాయి. భారీవర్షాలు కురిస్తే చాలు పాఠశాల కు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అధికారులు సందర్శించి వెళ్లారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిటీకీలకు మెష్ డో ర్లు లేక దోమల బెడద తీవ్రతరమైంది. కొన్ని కిటికీలకు తలుపులే లేవని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలోకి వెళ్లడానికి అనుమతి కూడా ఇవ్వట్లేదని, పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉంటోందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
భయం.. భయంగా
గురుకులంలో విషసర్పాలు పాఠశాల ఆవరణలో సంచరిస్తుండడంతో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల పాముల పట్టే వ్యక్తి వచ్చి పామును తీసుకెళ్లినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మరో వైపు గురుకుల ఆవరణలో కుక్కల బెడద కూడా అధికమైంది. చర్మ వ్యాధులతో బాధపడుతున్న కుక్కలు పాఠశాలల ఆవరణలో సంచరిస్తున్నట్లు విద్యార్థినులు చెబుతున్నారు. కాగా, బుధవారం రాత్రి ఎలుకలు దాడి చేసి గాయపరచడంపై విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు.


