● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
● ఐనవోలు ఆలయ సందర్శన, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల తనిఖీ
ఐనవోలు: ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతులు వినియోగించుకోవాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం రైతులకు ఉపయుక్తమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. నాబార్డు పథకం ద్వారా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధీనంలో నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్ సొసైటీకి డ్రోన్ మంజూరు కాగా, ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం సొసైటీకి అందజేశారు. ఈ సందర్భంగా నర్సంపేట, నెల్లికుదురు పీఏసీఎస్‌లకు అందించే మూడు డ్రోన్లకు సంబంధించిన వివరాలు వ్యోమిక్ డ్రోన్స్ సంస్ధ ప్రతినిధులు హనుమ, జగదీశ్ కలెక్టర్ తెలియజేశారు. అనంతరం పైలెట్ సూచనలతో కొద్దిసేపు డ్రోన్‌ను రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి స్వయంగా పరీక్షించారు. వ్యవసాయ శాఖ సబ్సిడీపై మంజూరైన బేలర్, రోటావేటర్, కల్టివేటర్లను రైతులకు అందించారు. అనంతరం నందనం సొసైటీ ద్వారా మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రూరల్ మార్ట్‌ను సందర్శించి నిర్వహణ బాగుందని ఇలాగే కొనసాగించాలన్నారు. బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్నకు మద్దతు ధర లభించడం లేదని పలువురు రైతులు మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వేనంబర్ 29 ప్రభుత్వ భూమి, 518, 519 సర్వేనంబర్లలో నిరుపయోగంగా ఉన్న భూమిలో రియల్‌ఎస్టేట్ దందా జరుగుతుందని అక్రమ నిర్మాణాలు తొలగించాలని పలువురు గ్రామస్తులు, రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఐనవోలు ఆలయంలో కోతుల బెడద అధికంగా ఉందని కోతులను అడవులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ రఘువంశీ నేతృత్వంలో పలువురు గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, నాబార్ట్ జిల్లా అభివృద్ధి అధికారులు చంద్రశేఖర్, చైతన్య హనుమకొండ, వరంగల్ జిల్లాల డీసీఓలు సంజీవరెడ్డి, నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఏడీఏ ఆదిరెడ్డి, సహకార శాఖ ఏరియా అధికారి జగన్మోహన్‌రావు, ఏఓ సునీల్‌కుమార్, ఎంపీఓ రఘుపతిరెడ్డి, ఏపీఓ కుమారస్వామి, సర్పంచ్‌లు రఘువంశీ, స్రవంతి, సొసైటీ సీఈఓ సంపత్‌లు పాల్గొన్నారు.
మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు. ఆలయ ప్రాంగణంలో ‘కుడా’ నిధులతో చేపట్టిన డార్మెటరీ హాల్ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఆలయ సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కార్యాలయాల తనిఖీ
తహసీల్, మండల పరిషత్ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రికార్డు గదిని పరిశీలించి భూ భారతి దరఖాస్తులు, సాదాబైనామ వివరాలను తహసీల్థార్ విక్రమ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న వెంచర్‌పై ఫిర్యాదులు రాగా, సర్వేయర్ సూరజ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును ఎంపీడీఓ నర్మదను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో గదుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని తాత్కాలికంగా అదనపు గదులు కావాలని కలెక్టర్ దృష్టికి ఎంపీడీఓ తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు.


