పోలీసుల భారీ బందోబస్తు మధ్య దళితులు ఉద్దాలను కురుమూర్తిగిరులకు తరలించారు. ఊకచెట్టు వాగులో ఉద్దాల చాట కింద భక్తులు దూరి తన్మయత్వం చెందారు. దీంతో రెండు గంటలపాటు ఊకచెట్టు వాగులో తిరునాళ్లు జరిగాయి. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చి తరించగా.. ఊకచెట్టు వాగు జనసంద్రంగా మారింది. శివసత్తుల పూనకాలు, భక్తుల ఆటపాటలతో గోవింద నామస్మరణ మారుమోగింది. అక్కడి నుంచి కాలి బాటన తిర్మలాపురం గ్రామ ఆంజనేయస్వామి ఆలయానికి చేర్చగా.. గ్రామస్తులు పూజలు నిర్వహించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్‌పై కురుమూర్తి గుట్టకు తీసుకువచ్చారు. దేవుడి చెరువు కట్ట మీద ఉద్దాలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు బారులుదీరారు. జాతర మైదానంలోని ఉద్దాల గుండు వద్ద భక్తులకు దర్శనం కల్పించి.. కాంచన గుహలో వెలసిన కురుమూర్తిస్వామి చెంతకు తీసుకెళ్లి అనంతరం ఉద్దాల మండపంలో కొలువుదీర్చారు. ఈ క్రమంలో వేలాది మంది భక్తులు దాసంగాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
000


