19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా | - | Sakshi
Sakshi News home page

19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

వనపర్తి: ప్రతి కుటుంబానికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టిందని.. 19వ తేదీ నుంచి గ్రామాలు, పట్టణాల్లో అమలుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజు, ఇతర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడుతూ.. ప్రకటించిన తేదీన ప్రతి గ్రామం, పట్టణ వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటుచేసి 18 నుంచి 59 ఏళ్లలోపు కుటుంబ సభ్యుల వివరాలు కచ్చితంగా సేకరించాలని సూచించారు. వయస్సు నిర్ధారణకు ఆధార్‌కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని.. సేకరించిన దరఖాస్తులను డిజిటలైజ్‌ చేసి అసలు దరఖాస్తులను జిల్లాస్థాయిలో భద్రపర్చాలన్నారు. రాబోయే 15 నుంచి 20 రోజుల పాటు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అర్హత కుటుంబానికి బీమా రక్షణ కల్పించేలా వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఆధార్‌ నంబర్లు, నామినీ వివరాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డిజిటల్‌ రికార్డుల్లోనూ పూర్తి కచ్చితత్వం పాటించాలన్నారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో జెడ్పీ సీఈఓ యాదయ్య, సీపీఓహరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement