పట్టువస్త్రాల తయారీలో అమరచింత నేతన్నలు
ఇలవేల్పుకు పట్టు కానుక..
● 15 రోజులుగా కొనసాగుతున్న
నేత పనులు
● స్వామివారి అలంకారోత్సవంలో
సమర్పణ
అమరచింత: పేదల తిరుపతి అమ్మాపురం శ్రీ కురుమూర్తిరాయుడి బ్రహ్మోత్సవాలకు అమరచింత నుంచి పట్టువస్త్రాలు సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14 జరిగే స్వామివారి అలంకారోత్సవానికి పట్టువస్త్రాలను ఇక్కడి నుంచి ఆలయానికి తరలించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. 15 రోజులుగా స్వామివారి పట్టువస్త్రాలను తయారు చేస్తున్న పద్మశాలి కులస్తులు స్వామివారి అలంకారోత్సవంలో పాల్గొని పట్టువస్త్రాలు అందించేందుకు సిద్ధమయ్యారు. అమరచింత నుంచి అమ్మాపురంలోని కురుమూర్తి ఆలయం వరకు పట్టువస్త్రాలను తలపై ఉంచి తీసుకెళ్లడానికి కుల బంధువుల పేర్లు రాసి లక్కిడిప్ ద్వారా ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు సంఘం అధ్యక్షుడు కొంగరి విజయభాస్కర్ తెలిపారు.
గతంలో కోనేటిపై..
60 ఏళ్ల కిందట అమరచింత పద్మశాలి కులస్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి పుష్కరిణిలోనే నీటిపై తేలియాడే డ్రమ్ములపై మగ్గం ఏర్పాటు చేసుకొని అక్కడే స్వామి, అమ్మవారికి వస్త్రాలను తయారు చేసి ఆలయ అర్చకులకు అందించి దేవస్థానం ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించేవారు. అప్పట్లో కోటకొండ కుర్మన్న, కొంగరి చిన్నయ్య, నరాల సింగోటం వస్త్రాలు తయారుచేసి భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించేవారు.
అమరచింత పద్మశాలి కులస్తులు తమ ప్రధాన వృత్తిగా ఉన్న చేనేతపై కురుమూర్తిరాయుడికి బ్రహ్మోత్సవాల సమయంలో వస్త్రాలను అందించడం ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. క్రమంగా నూలు వస్త్రాలకు బదులు ప్రస్తుతం పట్టు అందుబాటులోకి రావడంతో స్వామివారికి పట్టు పంచ, గౌను, అమ్మవారికి పట్టు చీరను స్వయంగా ప్రత్యేక మగ్గంపై నేసి సమర్పిస్తున్నారు. కులస్తులందరూ ఇందులో భాగస్వాములై ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరించి పట్టువస్త్రాల తయారీకి వినియోగించడం కొనసాగుతోంది.


