జిల్లాలో తోటల సాగు ఇలా..
కొత్త పురపాలికల్లో..
వివరాలు 8లో..
● ఎల్‌నినో ప్రభావంతో అడుగంటుతున్న వ్యవసాయ బోరుబావులు
● పంటలు, తోటల సంరక్షణపై ఆందోళన
● జాబ్‌కార్డులు ఉంటేనే పాంపాండ్ల నిర్మాణం
● వెలుసుబాటు కల్పించాలంటున్న
అన్నదాతలు
వీబీజీ రాంజీ పథకం ద్వారా పురపాలికల్లోని రైతులు, రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి. గతంలో గ్రామాలుగా ఉన్న వీటిని ఉన్న ఫలంగా పురపాలికలుగా అప్‌గ్రేడ్ చేయడంతో ఇక్కడి రైతులు, కూలీలు ఉపాధి కోల్పోయారు. ఎల్‌నినో ప్రభావంతో కూలి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తమ పొలాల్లో పాంపాండ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించి ఆదుకోవాలి.
– అజయ్, జిల్లా అధ్యక్షుడు,
వ్యవసాయ కార్మిక సంఘం, అమరచింత
పురపాలికల్లో వీబీజీ రాంజీ పథకం వర్తించదు. కేవలం గ్రామీణ రైతులు, రైతు కూలీలకు మాత్రమే ఉపాధి అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, అర్బన్ ప్రాంతాల్లో వీటిని తొలగించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అవకాశం కల్పిస్తాం.
– ఉమాదేవీ, డీఆర్డీఓ
అమరచింత: ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభం నుంచి అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం వీబీజీరాంజీ పథకంలో పొలాల వద్ద పాంపాండ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది. ఇది కేవలం గ్రామాల్లోని రైతులకు మాత్రమే అవకాశం కల్పించడంతో పట్టణాలు, పురపాలికల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు శాపంగా మారింది. పంట పొలాల్లోని వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం తగ్గుతున్న వేళ ఇంకుడుగుంతలు, పాంపాండ్లు నిర్మించుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా.. పథకం వర్తించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకొచ్చిన పాంపాండ్ల నిర్మాణం పుర రైతులకు సైతం వర్తించే విధంగా చట్టాన్ని సవరించాలని కోరుతున్నారు. వచ్చే మూడేళ్ల పాటు పరిస్థితి ఇలానే ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్న తరుణంలో తమ పంటలు, తోటలను ఎలా సంరక్షించుకోవాలో అర్థంగాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గతంలో తమకు జాబ్ కార్డులు ఉండటంతో వ్యవసాయ పనులు చేసుకుంటూ వందరోజుల కూలీ పనులు చేసుకునేవాళ్లమని.. ఇప్పుడు పురపాలిక అంటూ కొన్నేళ్లుగా జాబ్‌కార్డులను తొలగించడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే మామిడి, బత్తాయి, దానిమ్మ తోటల్లో చెట్లు వాడుముఖం పట్టడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
పురపాలికలకు అందని వీబీజీ రాంజీ పథకం
జిల్లావ్యాప్తంగా 19,394 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతున్నాయి. ఇందులో మామిడి 5,756 ఎకరాలు, జామ 491, దానిమ్మ 741, నిమ్మ (సిట్రస్ జాతి) 2,767, డ్రాగన్ ఫ్రూట్ 1,322 ఎకరాలు ఉన్నట్లు జిల్లా ఉద్యన అధికారులు వెల్లడిస్తున్నారు. వీటితో పాటు బత్తాయి, ఆయిల్‌పాం తోటలు సైతం సాగవుతున్నాయి.
జిల్లాలోని అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరును పురపాలికలుగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో జాబ్‌కార్డులుండి ఉపాధి పొందుతున్న వ్యవసాయ కార్మికులు ప్రస్తుతం ఉపాధి కోల్పోయారు. గతంలో అమరచింతలో 1,600, ఆత్మకూర్‌లో 1,500, కొత్తకోటలో 2,200, పెబ్బేరులో 3,150 మంది వ్యవసాయ కూలీలు, రైతులు జాబ్‌కార్డులతో ఉపాధి పొందేవారు. పురపాలికల్లో వీబీజీరాంజీ పథకం వర్తించకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఉపాధి కోల్పోయారు.


