నిధుల మంజూరు ఎప్పుడో..?
ఎరువుల వినియోగంపై ప్రభావం..
రూ.81.20 లక్షలతో భవన నిర్మాణం.. మూడేళ్లుగా నిరుపయోగం
● ఆధునిక యంత్రాలు, రసాయనాల కోసం ఎదురుచూపులు
● మరో రూ.25 లక్షలు వెచ్చిస్తేనే
అందుబాటులోకి..
● వేధిస్తున్న సిబ్బంది కొరత
వనపర్తి: రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలు చేరువ చేయాలి.. భూమిలోని పోషక విలువలను గుర్తించి నేల స్వభావానికి అనుగుణంగా పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలి. అవసరమైన ఎరువులనే వినియోగించేలా సూచనలు అందించాలి. ఇది భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు వెనుక ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం సుమారు రూ.81.20 లక్షలతో జిల్లాకేంద్రం సమీపంలోని నాగవరం శివారులో 2021, ఆగస్టులో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2023, సెప్టెంబర్‌లో నాటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడేళ్లు గడుస్తున్నా నేటికీ కేంద్రం వినియోగంలోకి రాలేదు. మరో రూ.25 లక్షలతో ఆధునిక యంత్రాలు, రసాయనాలు సమకూర్చాల్సి ఉంది. దీనికితోడు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఫలితంగా రైతులకు ఉపయోగపడాల్సిన భూసార పరీక్షల వ్యవస్థే నిర్లక్ష్యపు నీడలో చిక్కుకుంది.
నాలుగేళ్లుగా మట్టి నమూనాల సమస్య..
భూసార పరీక్షల నిర్వహణలో నాలుగేళ్లుగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. రైతుల మట్టి నమూనాలను పరీక్షించి ఫలితాలు వెల్లడించేందుకు అవసరమైన సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. నమూనాల సేకరణతో పాటు వాటి విశ్లేషణ, ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగితే భూసార పరీక్షల లక్ష్యం దెబ్బతింటుంది. రైతులకు సకాలంలో భూసార కార్డులు అందకపోతే ఏ నేలలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి? ఏ ఎరువు ఎంత మోతాదులో వినియోగించాలి? అనే విషయాలపై స్పష్టత లభించదు.
సిబ్బంది కొరత..
ప్రయోగశాలకు ఆధునిక యంత్రాలు సమకూర్చడమే కాకుండా వాటిని నిర్వహించే నైపుణ్యం కలిగిన సిబ్బంది కూడా అవసరం. ప్రస్తుతం సిబ్బంది కొరత సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పరికరాలు, రసాయనాలు అందుబాటులోకి వచ్చినా వాటిని నిర్వహించే సిబ్బంది లేకపోతే కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన సాంకేతిక సిబ్బందిని కూడా నియమించాల్సిన అవసరం ఉంది.
భూసార పరీక్ష కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేయాలంటే ఆధునిక యంత్రాలు, అవసరమైన రసాయనాలు సమకూర్చాల్సి ఉంది. ఇందుకోసం మరో రూ.25 లక్షల వరకు అవసరమని తెలుస్తోంది. భవన నిర్మాణానికి నిధులు వెచ్చించిన సమయంలోనే ప్రయోగశాల నిర్వహణకు అవసరమైన పరికరాలు, రసాయనాల కొనుగోలుకు కూడా ప్రణాళిక రూపొందించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా అవసరమైన నిధుల సమీకరణలో జాప్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
భూసార పరీక్షలు రైతులకు ఎంతో ఉపయోగకరమైనవి. నేలలో నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మ పోషకాల స్థాయిని పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వాటి ఆధారంగా పంటలకు అవసరమైన ఎరువులను సూచించవచ్చు. భూసార పరీక్షలు చేయకపోతే రైతులు నేల స్వభావాన్ని తెలుసుకోకుండానే ఎరువులు వినియోగించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సాగు పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండటంతో పాటు నేల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. శాసీ్త్రయ సాగు విధానాలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కూడా విఘాతం కలుగుతుంది.


