అమరచింత: జూరాల కాల్వలకు శనివారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సీఈ రహిమొద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి నవంబర్ 4 వరకు ప్రధాన ఎడమ, కుడి కాల్వలకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా రాకపోవడంతో వానాకాలంలో ఆయకట్టు కింద సాగుచేసిన వరి పంటలకు చివరితడిగా నీటిని అందించేందుకు ప్రభుత్వం ఆదేశించినట్లు వివరించారు. భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులోని నీటిని పొదుపుగా వినియోగిస్తున్నామన్నారు.
ఆత్మరక్షణ మార్చ్‌కు భారీగా తరలిరావాలి
వనపర్తి రూరల్: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నిర్వహించనున్న ఆత్మరక్షణ మార్చ్‌కు జిల్లా నుంచి భారీసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు ఓటు చోరీని అడ్డుకోవాలనే లక్ష్యంతో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో మార్చ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా నుంచి 150 మందికిపైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరినట్లు తెలిపారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిలబెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకతీతంగా మార్చ్‌లో పాల్గొనాలని కోరారు.
‘జలసిరి’ సద్వినియోగం చేసుకోవాలి
పాన్‌గల్: భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా అమలు చేస్తున్న జలసిరి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. శుక్రవారం మండలంలోని కేతేపల్లిలో జలసిరి పురోగతిని సర్పంచ్ రమేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో వలసల నివారణకు వీబీజీ రాంజీ పథకంలో చేపట్టే పనులకు ఎక్కువ సంఖ్యలో కూలీలు హాజరయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు చైతన్యం చేయాలన్నారు. రైతుల పొలాలో తవ్విన పాంపాండ్లను ఆమె పరిశీలించి గ్రామంలో ఇంకుడుగుంతలు, పాంపాండ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఎంపీడీఓ గోవిందరావు, ఏపీఓ కుర్మయ్య, ఈఈ ఆంజనేయులు, టీఏ పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ బీరయ్య, పంచాయతీ కార్యదర్శి పరశురాం, కూలీలు పాల్గొన్నారు.
సుస్థిర వ్యవసాయమే మేలు : డీఏఓ
ఖిల్లాఘనపురం: వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం చేయడంతో రైతులకు మేలు చేకూరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కమాలోద్ధీన్‌పూర్ రైతువేదికలో యాసంగిలో పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు జిల్లాలోని అన్ని రైతువేదికల్లో రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం, సుస్థిర సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గాయని.. యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేసి నీటిపొదుపు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, సర్పంచ్ గోపాల్, ఏఈఓ పవన్‌కళ్యాణ్, ఉప సర్పంచ్ చెన్నయ్య, గ్రామపెద్దలు, రైతులు పాల్గొన్నారు.


