●
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం జాతీయ, అంతర్జాయ, రాష్ట్రస్థాయి సంస్థలతో అధికారులు ఎంఓయూ (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్)లు కుదుర్చుకుంటున్నారు. అందులో భాగంగా పీయూ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ పాలమూరు బయోసైన్స్‌ను సందర్శించి.. ఇక్కడ చేపడుతున్న పరిశోధనలు, ప్రయోగాల గురించి సంస్థ ప్రతినిధులతో వివరాలు తెలుసుకున్నారు. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు పరిశోధన పరిజ్ఞానం అందించాలని విన్నవించారు. యూనివర్సిటీ పరిధిలోని గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, పీజీ కళాశాలల్లో పలు సైన్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పీయూ పరిధిలో మొత్తం 110 కళాశాలల్లో చదువుతున్న 25 వేల మంది విద్యార్థులకు ఈ ఎంఓయూలు వర్తించనున్నాయి.
కెమిస్ట్రీ విద్యార్థులకు శిక్షణ
గత నెలలో పీయూ అధికారులు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి సీఎస్‌ఐఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) హైదరాబాద్ వారితో ఎంఓయూ కుదుర్చుక్నునారు. ఇందులో కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు పరిశోధన పరంగా శిక్షణ ఇచ్చేందుకు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు పీయూలో చదివిన 12 మంది సీనియర్ విద్యార్థులు అక్కడ రీసెర్చిలో పాల్గొనడం గమనార్హం. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీతోపాటు పలు సంస్థల్లో ఇలాంటి అవకాశాలు విద్యార్థులకు లభిస్తున్నాయి. ఇక మ్యాజిక్ బస్ వంటి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించి వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీటితోపాటు ఎక్స్‌టెల్ టెక్ ప్రైవేటు లిమిటెడ్, డాక్టర్ ఎమ్మెస్కే రావు రీసెర్చి అండ్ ఇన్నోవేషన్ సొల్యూషన్స్, క్లినోసాల్ రీసెర్చి ప్రైవేట్ లిమిటెడ్, పాలమూరు రైతు డెవలప్‌మెంట్ సొసైటీ, మహబూబ్‌నగర్, కల్పవృక్ష మ్యూచువల్ ఎయిడ్ మల్టీపర్సస్ కోఆపరేటివ్ సొసైటీ, మహబూబ్‌నగర్, ఏరో ఫైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. త్వరలో మరిన్ని సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
వందరోజుల శిక్షణ..
పీయూ పరిధిలోని విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కోడ్‌తంత్ర అనే సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే శిక్షణలో విద్యార్థులకు బిహేవియర్, లాంగ్వేజ్, పర్సనాలిటీ, ప్రొఫీషియన్సీ, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే.. విద్యార్థులు తమకు నచ్చిన భాషలో ప్రశ్నలు వేస్తే అది తిరిగి సమాధానం చెబుతుంది. ఇలా విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి. ఎలాంటి సమాధానాలు చెప్పాలి అనే అంశంపై వందరోజుల శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన వారికి సంస్థ సర్టిఫికెట్ సైతం అందించనుంది. వీటి ద్వారా విద్యార్థులు సులువుగా ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికే సుమారు 8 వేల మంది శిక్షణ తీసుకుంటున్నారు.
నాణ్యమైన విద్య..
పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యతో పనిచేస్తున్నాం. అలాగే విద్యార్థుల చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించేలా చర్యలు తీసుకుంటన్నాం. అందుకోసం ఇప్పటికే పలు సంస్థలతో ఎంఓయూలు చేసుకున్నాం. శుక్రవారం పాలమూరు బయోటెక్ సంస్థను సందర్శించి.. పీయూ విద్యార్థులకు పరిశోధన పరమైన శిక్షణ ఇవ్వాలని కోరాం. తద్వారా విద్యార్థులు ఏ సంస్థకు వెళ్లినా వెంటనే మంచి వేతనంతో సులువుగా ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నాం. మరో సంస్థ ఆధ్వర్యంలో 100 రోజుల స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తున్నాం.
– జీఎన్ శ్రీనివాస్, వీసీ, పీయూ
వివిధ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణకు పీయూ ఎంఓయూలు
తద్వారా విద్యార్థుల రీసెర్చి, ట్రైనింగ్‌కు విరివిగా అవకాశాలు
రెండేళ్లలో 9 సంస్థలతో ఒప్పందాలు.. తాజాగా పాలమూరు బయోసైన్స్‌తో చర్చలు
చదువు పూర్తయిన వెంటనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లకు ఆస్కారం
డిగ్రీ స్థాయిలోనే స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణకు శ్రీకారం చుట్టిన అధికారులు
రీసెర్చి ఫెసిలిటీ భవనం..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 కోట్ల నుంచి రీసెర్చి ఫెసిలిటీ భవనాన్ని నిర్మించారు. ఇలాంటి రీసెర్చి ఫెసిలిటీ భవనం హైదరాబాద్ మినహా ఎక్కడా అందుబాటులో లేదు. ఇందులో రూ.కోట్లు వెచ్చించి అత్యాధునిక పరికరాలు, మైక్రోస్కోప్‌లు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటి కోసం సుమారు రూ.10 కోట్లతో టెండర్ పిలిచారు. విదేశాల నుంచి పరికరాలు త్వరలో దిగుమతి కానున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రైవేటు కంపెనీలు, సంస్థలు, రీసెర్చి స్కాలర్స్ ఇక్కడ కొత్త అంశాలపై రీసెర్చి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. అలాగే దీనిని వినియోగించుకున్నందుకు కొంత మొత్తాన్ని కూడా వసూలు చేయనున్నారు. అంతేకాకుండా పలు ప్రాజెక్టులు సైతం యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఉంది.


